koodali

Sunday 31 August 2014

పాత రభసే

ప్రతినాయకుడికి తెలియకుండా అతని ఇంట్లోనే కథానాయకుడు చేరటం, బ్రహ్మానందం లాంటి విదూషకుడు అతనికి సాయం చేయటం లేదా అతన్ని పట్టించబోయి తన్నులు తినటం, ప్రతినాయకుడికి ఎంత మందీ మార్బలం ఉన్నా కథానాయకుడు ఒంటి చేత్తో అందర్నీ మట్టి కరిపించటం....ఈ తరహా చిత్రాలెన్నో వచ్చాయి. కొత్తగా వచ్చిన రభస కూడా అదే 'దారం' పై వచ్చిందే. 

               
కథ: తల్లి ఆశని నెరవేర్చటం కోసం ఊరి నుండి నగరానికి వెళ్ళిన కార్తిక్ (జూ. ఎన్ టి ఆర్) ఆ క్రమంలో అనుకోకుండా ఒక పెళ్ళి ఆగిపోవదానికీ, రెండు కుటుంబాలు విడిపోవడానికీ కారణమవుతాడు.తన ద్వారా జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడు? తల్లి ఆశని నెరవేర్చాడా? లెదా? అన్నది కథాంశం.

విశ్లేషణ: నిజానికి ఇది చాలా పాత కథ. ఇలాంటి కథలతో, సన్నివేశాలతో రీళ్ళకు రీళ్ళరిగిపోయాయి. ఇప్పుడు రీళ్ళు లేవు కాబట్టి శాటిలైట్ విధానంలో మన మెదళ్ళూ, కళ్ళూ ఖరాబు చెయ్యాలని మళ్ళీ మళ్ళీ తీసి మన పైకి వదులుతున్నట్టున్నారు.
కథా పరంగా చూసినా, మరే విధంగా చూసినా చిత్రం పేరుకీ, చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. కథానాయకుడు పెద్దగా రభస చేసిందేం లేదు. అయితే గియితే పోరాట సన్నివేశాల్లో తెలుగు సినిమా మార్కు రభస చూపించాడంతే!
ఇక నటనా పరంగా చూస్తే, జూ. ఎన్ టి ఆర్ ఎప్పట్లాగే చురుకుగా, సులువుగా చేసుకుపోయాడు.
ప్రణీత మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతుంది, సమంత పాత్ర తిన్నగా ఉండదు. ఉండనీయదు. మిగతా వాళ్ళందరూ తమ తమ పాత్రలు చేసుకుపోయారు.
ముందే చెప్పుకున్నట్టు, కథే కాకుండా సన్నివేశాలు కూడా పాత మూసలోనే సా.....గిపోయాయి. ఒక 'సీ క్లాసు ప్రెక్షకుడు కూడా తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగేలా ఉన్నాయి తప్ప ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ లేదు.
రఘుబాబు బృందం,  బ్రహ్మానందం, అలీలపై చిత్రించిన హాస్య సన్నివేశాలలో కొత్తదనం లేక నవ్వించలేకపోయాయి.
 క్లైమాక్స్ ఐతే మిర్చి లాగే ఉంది. కానీ, ఆ చిత్రంలో ఉన్నంత ఉద్వేగభరితంగా లేదు.

ఇక సాంకేతిక బృందంలో అంతా ఏదో మొక్కుబడిగా పని చేసినట్టే అనిపిస్తుంది. దర్షకుడేఅ అందించిన మాటల్లో ఒకట్రెండు మినహా పెద్దగా చెప్పుకునేవేం లేవు. అదీ రభస పరిస్థితి.   

 

Sunday 17 August 2014

మాస్ రౌడీ ' సికిందర్'

"రజనీకాంత్ కి 'బాషా', కమలహాసన్ కి 'నాయకుడు ' లాగా సూర్యకి 'సికిందర్' మిగిలిపొతుంది"
"ఈ చిత్రం లో సూర్య స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తాడు"

'సికిందర్' చిత్రం గురించి నిర్మాత శ్రీధర్, దర్శకుడు లింగు స్వామి ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఇవి.
పై  స్టేట్ మెంట్స్ ప్రకారం చిత్రాన్ని పరిశీలిద్దాం....

ముందుగా కథ విషయానికి వస్తే,
 ముంబై లో పెద్ద దాదా ఐన రాజు భాయ్ (సూర్య), తన ప్రాణ  స్నే హితుడు చందు (విద్యుత్ జమాల్) ని చంపిన వారిపై పగ తీర్చుకోవటమే చిత్రం లోని ప్రధాన అంశం. 
 విశ్లేషణ:  
రజనీకాంత్ 'బాషా' గా మారినా, కమల్ 'నాయకుడి ' గా ఎదిగినా దాని వెనుక బలమైన కారణం ఉంది.
వారు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా చట్ట విరుద్ధమైన పనులు చేయలెదు.
స్నేహితుడి మరణం మాణిక్యం ని 'బాషా' గా మార్చితే, పేద ప్రజలపై జరిగే దాష్టీకాలు వీర నాయుడిని నాయకుడిగా మారుస్తాయి. అలా ఆ కథలకూ, ఆ పాత్రలకూ ఒక పరిపూర్ణత, ఉదాత్తత ఏర్పడింది.
కానీ, 'సికిందర్' లో ఇలాంటివేవీ కనిపించవు. రాజు, చందులు చేసేది చట్ట వ్యతిరేకమైన వ్యాపారాలు. కథానాయకుడిని ఇలాంటి పాత్రలో చూపటం ఎంత వరకు సమంజసం?
అదీ కాక దర్శకుడు తను చెప్పినట్టు సూర్యని స్టైలిష్ గా కాక  కేవలం ఒక మాస్ రౌడీగా  మాత్రమే చూపించాడు.
సూర్య పాత్రని రెండు రకాలుగా చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసి, దానిని చివరిదాకా కొనసాగించలేకపోయాడు.
చిత్రం మంచి ఉత్కంఠగా సాగుతుండగా హఠాత్తుగా సమంతని ప్రవేశపెడతాడు. పోలీస్ కమీషనర్ కూతురైన ఆమె షరామామూలుగా సూర్యని ప్రేమించటం, సూర్య వెంటపడటం, సూర్య కూడా తనని ప్రేమించటం....దీని వల్ల కథా గమనం దెబ్బతిన్నది. అలాగే చందుని చంపిన వారిని వేటాడుతున్న సూర్య హఠాత్తుగా సమంతతో పాట పాడుకోవటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
పాత్రధారులు :
ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా ఊహించగలిగేలా ఉన్న ఈ చిత్రంలో పాత్రధారుల విషయానికి వస్తే,
అమాయకుడైన కృష్ణగా, మాయకుడైన రాజు భాయ్ గా రెండు పాత్రలకు సూర్య సరిపోయాడు. నిజానికి అతడి అభినయం అంతా పాత్రలోనే కనిపిస్తుంది. తుపాకులు పేల్చటం, ఫైటింగులూ, చేజింగులూ చేయటమే కదా!

అతని మిత్రుడిగా విద్యుత్ జమాల్ బాగున్నడు. అతను తొలిసారిగా చేసిన పాజిటివ్ పాత్ర బహుశా ఇదే కావచ్చు. కథా పరంగా ప్రాముఖ్యం ఉన్న పాత్ర కాబట్టీ అతనిపై మరిన్ని సన్నివేశాలు ఉండాల్సింది.

సమంత - నిజానికి తనది అక్కర్లేని పాత్ర. వట్టి పాటల కోసం, చిత్రాన్ని పొడిగించటం కోసం మాత్రమే తనని తీసుకున్నట్టు ఉంది. అది కూడా బలవంతంగా ఇరికించేసారు. ఈ చిత్రంలో కనిపించినంత అసభ్యంగా, చెత్తగా ఇంత వరకూ మరే చిత్రంలోనూ కనిపించలేదు. 

మిగతా నటులు, సాంకేతిక బ్రుందం అంతా తమ పరిధి మేరకు చేసారు.
ఈ లాజిక్కులన్నీ వదిలేసి కాలక్షేపానికి ఒక సారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

కొసమెరుపు:చిత్రం చూసిన తరువాత ఒక ప్రేక్షకుడి వ్యాఖ్య...
"ఇలాంటి  సినిమాలు చూసినంక దొంగలు తయారుకారా మరి"
దర్శకులూ, హీరోలూ వింటున్నారా మరి !!