koodali

Sunday 7 June 2015

aarti agarwal - నువ్వు మాకు నచ్చావ్...(Bharath Rushi-The Boss)

ఎందుకొచ్చావ్...
ఎందుకెళ్ళిపోయావ్...
తీరానికి అల వచ్చిపోయినట్లు
తెరపైకి అలా వచ్చి, పోయావేం?
నిన్ను చూసిన తనివి తీరనే లేదు
నిన్నింకా చూడాలన్న ఆర్తి ఆరనే లేదు
అందమైన కల మొదత్లోనే చెదిరిపోయినట్లు
అదృశ్యమైపోయావేం?
చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి, గుండెలు
చెమ్మగిల్లేలా చేసావేం?

అయినా నువ్వు మాకు నచ్చావ్...నచ్చావ్....

Thursday 4 June 2015

Sreemantudu Story (not Official) శ్రీమంతుడి కథ - ఒక అంచనా

హర్ష (మహేష్ బాబు)కి లెక్క లేనంత ఆస్తి ఉంటుంది.  అతనికి లేనిది లేదని అంతా అతని గురించి అనుకుంటారు.  కాని అతనికి ఇంకేదో కావాలి అనిపిస్తుంటుంది. అదేంటో తెలుసుకోవడం కోసం అతను అన్వేషిస్తుంటాడు.  ఆ అన్వేషణలో భాగంగా తన పూర్వీకులు పుట్టి, పెరిగిన ఊరిని దత్తత తీసుకుంటాడు. 
ఆ ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చి, బాగుచేయాలనుకుంటాడు.కానీ అతనికి అడుగడుగునా ఒక విలన్ అడ్డుపడుతుంటాడు. అతని బారి నుండి ఊరిని ఎలా కాపాడాడు? అసలు అతనికీ, ఆ ఊరికీ సంబంధం ఏంటి? అతని దబ్బుతో అతను పొందలేనిది? ఆ ఊర్లో పొందగలిగింది ఏంటి? అనేది మిగతా కథ.
నా అంచనా ప్రకారం కుటుంబ సంబంధాలు, మన సంప్రదాయాల గురించిన సినిమా. ఉద్వేగాలు, అనుభూతులూ, హాస్యం, భీబత్సం....ఇలా అన్ని రసాలూ మేళవించిన మంచి సినిమా అవుతుందనిపిస్తోంది. మిర్చి దర్శకుడైన కొరటాల శివ పై నమ్మకం పెట్టొచ్చు.  మీరేమంటారు.....?

Tuesday 2 June 2015

Baahubali Story.....(Guess..not Official) బాహుబలి కథ ఇదిగో...(ఒక ఊహ)

మహిష్మతి అనె ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పల్లెటూరు. ఆ ఊరికి మొనగాడు శివుడు. నిజానికి అతడో రాకుమారుడు. అతని అసలు పేరు వీరేంద్ర బాహుబలి. అతని తండ్రి పేరు అమరేంద్ర బాహుబలి. సొంత తమ్ముడే రాజ్యం కోసం అమరేంద్ర కుటుంబాన్ని చంపిస్తాడు. వీరేంద్ర మాత్రం బతుకుతాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని పల్లె వాసులు రక్షిస్తారు. ఈ నిజం తెలుసుకున్న శివుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తన రాజ్యాన్ని పాలిస్తున్న చిన్నాన్న బిజ్జల దేవ కొడుకు బళ్ళాల దేవ కొలువులో చేరి, అతని నమ్మకాన్ని చూరగొంటాడు. రహస్యంగా సైన్యాన్ని సమీకరించుకుంటాడు. తమ్ముడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి రాజ్యాన్ని దక్కించుకుంటాడు.
అదీ కథ.....



Tuesday 17 March 2015

నన్నే ముంచే నీ ప్రేమలో... Nanne Munche Nee Premalo....

'నన్ను ప్రేమించవూ' అని నిన్ను బతిమాలుకోవాలనుంది
నువ్వొప్పుకోనంటే బతుకే దండగని
నీ కాళ్ళు పట్టుకోవాలనుంది
'నీ ఖర్మ, ఏడువ్' అనైనా సరే
నువ్వనే దాకా విసిగించాలనుంది
ఇలా ప్రేమని అడుక్కోవటం నా
ఈగోకి కంపరంగానే ఉంది
నువ్వు తలపుకు రాగానే
ఈగోలన్నీ తోక ముడుస్తున్నాయి
నిన్ను తలచుకోని క్షణముందా అసలు!
నువ్వు నా దరికి రాగానే
ఇష్టాలన్నీ  మారిపోతున్నాయి
నువ్వున్నది నాలోనే కదా మరి!!
మిన్నూ మన్నూ ఏకం చేసైనా
నిన్ను చేరాలనుంది
ఇదే చివరాఖరు
ఇంక ప్రేమించనెవ్వరినీ
సరే అంటే నువ్వూ నాతో
ససేమిరా అంటే నేనే నాతో
ఒంటరినై సాగమంటావో...
జంటై సాగుదామంటావో...
నీ వలపుల తలపులతో
పులకింతల కలవరింతలలో
కలవరపడుతూ నేనేం
రాసానో తెలీకనే రాసానిది
తప్పుల్ని మన్నించి నిన్నే
తలపోసే మది గొడు ఆలకిస్తావు కదూ....


అది చాలు Adhi Chaalu

నీవొక సౌందర్య సంద్రం
నన్నో నీటి బొట్టుగా ఉండనీ చాలు
నీ కరకు చూపుల సెగలోన నను
చలి కాచుకోనీ చాలు
నీ చిరునవ్వుల వెన్నెలలో
నిదురించనీ చాలు
క్షణమైనా సరే, నీ సాన్నిధ్యంలో
ఉండనీ చాలు
నీవు నా సొంతం కాదని తెలుసు
నీకు నేను ముఖ్యం కాదని తెలుసు
అయినా
నీ మదిగదిలో ఏదో ఒక మూల
                                                                                                        నాకింత చోటివ్వు చాలు
                                                                                                        ఈ జన్మకది చాలు

Sunday 15 February 2015

టెంపర్ అసలైన రివ్యూ TEMPER Original Review

అప్పుడెప్పుడో జూ.ఎన్ టి ఆర్ ని 'ఆంధ్రావాలా'గా చూపించి అభిమానులని నిరాశపరిచిన పూరి ఈసారి 'టెంపర్'ఫుల్ గా చూపించే ప్రయత్నం చేసారు. జూ.ఎన్ టి ఆర్ పై ఈ సినిమా ప్రభావం పదేళ్ళ పాటు ఉంటుందని ఆడియో వేడుకలో చెప్పి చిత్రంపై అంచనాలు పెంచిన పూరి ఆ అంచనాలని నిలబెట్టారా? లేదా? ఓ సారి చూద్దాం....

కథ: ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేని పోలిస్ అధికారి దయా (జూ ఎన్ టి ఆర్ ). అతను వైజాగ్ లో పెద్ద రౌడీ అయిన వాల్తేరు వాసు (ప్రకాష్ రాజ్) చేసే అక్రమాలకి అండగా ఉంటాడు. అతనంటే ప్రజల్లో కానీ, డిపార్ట్ మెంట్ లో కానీ ఎవరికీ గౌరవం ఉండదు. ఒక సందర్భం లో ఒక అమ్మాయి అత్యాచారం, హత్య కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. అది చేసింది వాసు నలుగురు తమ్ముళ్ళే అని నిరూపించే సిడి దయాకి దొరుకుతుంది. ఆ సిడిలో దయా తమ్ముళ్ళు ఆ అమ్మాయిపై చేసిన హింసాకాండను చూసి దయా వాల్లకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలనుకుంటాడు. అతని ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:  దయాగా  జూ ఎన్ టి ఆర్ అభినయం, శారీరక భాష కొత్తగా ఉంది. కానీ, అదంతా బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబుని తలపించేలా ఉండటం విచిత్రం. తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర పోసాని కృష్ణ మురళిది.  పక్కనే ఉంటూ అతన్ని మార్చాలని ప్రయత్నించే ఎస్ ఐ పాత్రలో  పోసాని ఆకట్టుకుంటారు. కాజల్ జంతు ప్రేమికురాలు. తను వాటి గురించి మాట్లాడుతుంటే ఎన్.టి.ఆర్ తన కోరిక గురించి ద్వందార్థంలో మాట్లాడటం చాలా చండాలంగా ఉంది. హీరోయిన్ ని కేవలం తన అవసరానికి వాడి వదిలేయానుకున్న హీరో ఆమె  కోసం హఠాత్తుగా మారిపోయినట్లు చూపిస్తారు. దానికి కారణాలేం కనిపించవు. దాని వల్ల లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. మిగత ఎవరి పాత్రలకీ అంత స్కోప్ లేదు.ఇంటర్వెల్ బాంగ్ పవర్ ఫుల్ గా ఉంది. సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ పాకేజ్ ఉంటుందని ఊహిస్తాం. కాని అదంతా ఉత్తదే అని మొదలైన 2 నిమిషాల్లోనే తేలిపోతుంది. ఇకపోతే ఎన్ టి ఆర్ మారిపోయే సన్నివేశం, కోర్టు సన్నివేశం ఆకట్టుకుంటాయి. జూ ఎన్ టి ఆర్ మారినప్పటి నుండి  చిత్రం ఆసక్తికరం గా సాగుతుంది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కి మైనస్ పాయంట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్. కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల అంతగా ఆసక్తి కలగదు. ఎంటర్ టైన్ మెంట్ కి చాలా అవకాశం ఉన్నా కానీ దాన్ని సరిగా వినియోగించుకోలేదు. దాని వల్ల  ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ఎంటర్ టైన్ మెంట్ ఉంటే బాగుండేది. పైగా  కథలో కొత్తదనం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ లు ఇది వరకే చాలా వచ్చాయి. మొన్నీ మధ్యే వచ్చిన పటాస్ కూడా దాదాపు ఇలాంటిదే. ఐనా ఎంటర్ టైన్ మెంట్ వల్ల ఆకట్టుకోగలిగింది.

సాంకేతిక విభాగం :

అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఓకే అనిపించుకున్నాయి. 'దేవుడా' పాట మాస్ ని ఆకట్టుకుంటుంది.  సినిమా మొత్తాన్ని ఒక స్టైలిష్ యాక్షన్ పెయింటింగ్ లా చూపించిన క్రెడిట్ మాత్రం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుకి దక్కుతుంది. మిగతా విభాగాలన్నీ ఓకే.